డయాలిసిస్ సేవలు గ్రామీణ పేదలకు గొప్ప ఊరట మంత్రి సత్యకుమార్ యాదవ్
డయాలిసిస్ సేవలు గ్రామీణ పేదలకు గొప్ప ఊరట మంత్రి సత్యకుమార్ యాదవ్
పుట్టపర్తిలో ఆధునిక డయాలిసిస్ సెంటర్ ప్రారంభించినమంత్రి
₹7.4 కోట్ల క్యాన్సర్ కేర్ సెంటర్ పనులు పరిశీలించిన మంత్రి
శ్రీ సత్యసాయిజిల్లా బ్యూరో మే15, (వెలుగు నాడు ప్రతినిధి) : పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ప్యాలియేటివ్ కేర్ అండ్ క్యాన్సర్ సెంటర్‌లో బెంగళూరు కిడ్నీ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆధునిక డయాలిసిస్ సెంటర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని వైద్య సదుపాయాలను పరిశీలించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రస్తుతం అందిస్తున్న ఔట్ పేషెంట్ (OP) సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుమారు ₹7.4 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న క్యాన్సర్ కేర్ మరియు ప్యాలియేటివ్ కేర్ సెంటర్ పనులను పరిశీలించి, నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి కేవలం చికిత్స మాత్రమే కాదు, మానసిక ధైర్యం, సాంత్వన మరియు గౌరవప్రదమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రం అభివృద్ధి చెందుతుండటం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా డయాలిసిస్ సేవలు గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తాయని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఖరీదైన వైద్యం భారంగా మారకుండా, సేవా భావంతో ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేందుకు సంస్థలు ముందుకు రావడం సమాజానికి మంచి సంకేతమని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైన బెంగళూరు కిడ్నీ ఫౌండేషన్ ప్రతినిధులను, వైద్య సిబ్బందిని మరియు శ్రీ సత్యసాయి సంస్థ సేవా కార్యకర్తలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పుట్టపర్తి వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో సేవా తత్వంతో నిర్మితమవుతున్న ఈ క్యాన్సర్ మరియు ప్యాలియేటివ్ కేర్ సెంటర్ భవిష్యత్తులో రాయలసీమ ప్రాంత ప్రజలకు గొప్ప ఆధారంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందరికీ చేరేలా ప్రభుత్వం మరియు సేవా సంస్థలు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్, డిఎంహెచ్ఓ ఫైరోజ్ బేగం, సేవా సంస్థ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0