వికారాబాద్‌లో విషాదం వైద్యం వికటించి చిన్నారి మృతి

Jun 1, 2026 - 22:22
 0  14
వికారాబాద్‌లో విషాదం వైద్యం వికటించి చిన్నారి మృతి

వికారాబాద్‌లో విషాదం వైద్యం వికటించి చిన్నారి మృతి

వికారాబాద్ జూన్ 01, (వెలుగునాడుప్రతినిధి) : వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహావీర్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ పాప ప్రాణాలు కోల్పోయిందంటూ తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అనారోగ్యంతో ఉన్న తమ చిన్నారిని చికిత్స నిమిత్తం వికారాబాద్‌లోని మహావీర్ ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అయితే, ఆ సమయంలో ఆస్పత్రిలో అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లు అందుబాటులో లేరని అన్నారు. డ్యూటీలో ఉన్న ఒక జూనియర్ డాక్టర్, అందుబాటులో లేని సీనియర్ డాక్టర్‌కు ఫోన్ చేసి, ఆయన ఫోన్‌లో చెప్పిన సలహాలు, సూచనల ఆధారంగా చిన్నారికి వైద్యం అందించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్యం వికటించి తమ పాప మరణించిందని తల్లిదండ్రులు చెప్పారు. సీనియర్ డాక్టర్ స్వయంగా పరిశీలించకుండా, కేవలం సెల్ ఫోన్ ద్వారా ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని తల్లిదండ్రులుకన్నీరుమున్నీరవుతున్నారు. ఆస్పత్రి వద్దే బాధితుల ఆందోళన చిన్నారి మృతితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి గేటు వద్దే చిన్నారి మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ ఆస్పత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూనియర్, సీనియర్ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్