అలిపిరి ప్రాంతంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యం దృష్ట్యా తాత్కాలిక దుకాణాల తొలగింపు

Jun 2, 2026 - 22:53
 0  7
అలిపిరి ప్రాంతంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యం దృష్ట్యా తాత్కాలిక దుకాణాల తొలగింపు

అలిపిరి ప్రాంతంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యం దృష్ట్యా తాత్కాలిక దుకాణాల తొలగింపు.

అలిపిరి వద్ద దుకాణాలు కోల్పోయిన వారికి న్యాయం చేస్తాం 

జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి జూన్ 02, (వెలుగు నాడు ప్రతినిధి) : అలిపిరి ప్రాంతంలో తాత్కాలిక దుకాణాల తొలగింపుతో ఉపాధి కోల్పోయిన దుకాణదారులు మంగళవారం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్‌ను కలిసి తమ సమస్యలను వివరించి, న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తుంటారని, తిరుమలకు ప్రధాన ముఖద్వారమైన అలిపిరి ప్రాంతంలో భక్తుల రద్దీ ఎల్లప్పుడూ అధికంగా ఉంటుందని తెలిపారు.అలిపిరి ప్రాంతంలో రహదారి పక్కన పెద్ద ఎత్తున తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల భక్తుల రాకపోకలకు, వాహనాల సంచారానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. అలిపిరి వద్ద కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన లగేజీ కౌంటర్ కారణంగా కూడా ఈ ప్రాంతంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతోందన్నారు.అలిపిరి పరిసర ప్రాంతాలలో భారతీయ విద్యాభవన్, సైన్స్ సెంటర్, వేదిక్ యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్‌సీసీ అకాడమీ, అరవింద్ కంటి ఆసుపత్రి, టాటా క్యాన్సర్ ఆసుపత్రి, జూపార్క్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో వాహనాల రాకపోకలు అధికంగా ఉండి ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల కారణంగా రోడ్డు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. అలిపిరి పరిసర ప్రాంతాలు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండటంతో వన్యప్రాణుల సంచారం పెరిగిందని, ఇటీవల చిరుతపులులు ఎస్.వి. యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోకి కూడా రావడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. భక్తులు, వాహన చోదకులు మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.ఆఈ నేపథ్యంలో భక్తులకు, వాహన చోదకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు అటవీ శాఖ, పోలీసు శాఖ, నగరపాలక సంస్థ, రెవెన్యూ శాఖ సంబంధిత అధికారులు సంయుక్తంగా చర్చించి తాత్కాలిక దుకాణాలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.అయితే, దుకాణాల తొలగింపుతో ఉపాధి కోల్పోయిన వారిలో అర్హులైన వారికి ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. బాధితుల సమస్యలను సానుభూతితో పరిశీలించి సాధ్యమైనంత మేరకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్