సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
ఐఐటి ధన్ బాద్ సహాయ ఆచార్యులు చంద్రశేఖరరావు
తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 02 (వెలుగు నాడు ప్రతినిధి) : సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఐఐటి ధన్ బాద్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ.చంద్రశేఖరరావు సూచించారు. భారత ప్రభుత్వ ఆదేశాలమేరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంద్రప్రదేశ్ (ఏపీ నిట్) లోని వెబ్, నెట్ వర్క్, టెలీ సర్వీసెస్ విభాగం ఆధ్వర్యంలో సైబర్ జాగరూక్త దివాస్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన, అసోసియేట్ డీన్ డాక్టర్ పులి కిషోర్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధి సహాయ ఆచార్యులు, డాక్టర్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. సైబర్ నేరగాళ్లు సామాన్య వ్యక్తుల నుంచి వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకుల వరకు ఎవర్నీ వదలకుండా మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో సందేశాలు, లింకులు చరవాణిలకు పంపుతున్నారని, పొరపాటున వాటిపై క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలోని సొమ్ములు, విలువైన డేటాను చోరీ చేస్తున్నారని చెప్పారు. మనకు తెలియని, అనవసర లింకులను క్లిక్ చేస్తే ఫోన్లు హ్యాక్ అవ్వటంతోపాటు డేటా చోరీకి గురవుతుందన్నారు. సైబర్ నేరగాళ్లు లేనిపోని ఆశలు చూపించి నేరాలకు పాల్పడుతున్నారని, ఆశపడితే లేనిపోని అనర్థాలకు గురవ్వాల్సి ఉంటుందని తెలిపారు. మోసాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మనల్ని మనమే రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రపంచంలో సైబర్ నేరాల వల్ల 8 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని 2023లో అంచనావేశారని, ఇది 2026 నాటికి 10.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా అని వివరించారు. ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగించుకునేలా యువతకు దిశానిర్దేశం చేయాలని వివరించారు. అనంతరం నిట్ ఆచార్యులు చంద్రశేఖరరావును శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ శ్రీ ఫణి కృష్ణ కర్రి, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ జీబి వీరేష్ కుమార్, డాక్టర్ చేబ్రోలు శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0