ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అప్రమత్తంగా ఉండాలి:
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అప్రమత్తంగా ఉండాలి:
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు
మైలవరం జూన్ 11,( వెలుగు నాడు ప్రతినిధి) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్ - Special Intensive Revision) కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా వ్యవహరించాలని మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపునిచ్చారు. మైలవరంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణమండపంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో ఆయన కూటమి శ్రేణులకు ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం నమోదు చేయబడిన ఓట్లను సుమారు 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి సమగ్రంగా, అత్యంత సూక్ష్మంగా పరిశీలించే ప్రక్రియనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) అని వివరించారు. సాధారణంగా ప్రతి ఎన్నికల సమయంలో కొత్త ఓట్లను చేర్చడం, మరణించిన లేదా అర్హత కోల్పోయిన వారి ఓట్లను తొలగించడం జరుగుతుందని, అయితే ప్రస్తుతం చేపడుతున్న ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రక్రియ అని తెలిపారు.2002లో ఒకసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించారని, మళ్లీ 24 ఏళ్ల తర్వాత 2026లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 2002కు ముందు నమోదైన ఓట్లను మినహాయించి, 2002 తర్వాత నమోదైన అన్ని ఓట్లను ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు. ఆ కాలంలో నమోదైన ఓటర్లు తమ వివరాలను ధ్రువీకరించుకొని, మ్యాపింగ్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నెల 14వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు సర్వే నిర్వహించబడుతుందని తెలిపారు. సంబంధిత అధికారులు ఇంటింటికీ వచ్చి ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తారని, ఆ సమయంలో కుటుంబ సభ్యుల ఓట్లను నిర్ధారించి సర్వే పత్రాలపై సంతకాలు చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నప్పటికీ కుటుంబ పెద్ద ధ్రువీకరణ తప్పనిసరి అని వివరించారు.ఈ ప్రక్రియలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బి.ఎల్.ఓలు)తో పాటు రాజకీయ పార్టీలు నియమించే బూత్ లెవల్ ఏజెంట్లు (బి.ఎల్.ఏలు) కూడా పాల్గొంటారని తెలిపారు. బి.ఎల్.ఓలను ఎన్నికల సంఘం నియమిస్తే, బి.ఎల్.ఏలను ఆయా రాజకీయ పార్టీలు నియమిస్తాయని చెప్పారు. మ్యాపింగ్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.ఒకవేళ నిర్లక్ష్యంగా మ్యాపింగ్ చేయించుకోకుండా వదిలేస్తే, జూలై 14 తర్వాత ఓటు హక్కును తిరిగి పొందేందుకు సంక్లిష్టమైన ప్రక్రియను అనుసరించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇందుకోసం ఎన్నికల సంఘం గుర్తించిన 14 రకాల ధ్రువపత్రాల్లో ఒకదాన్ని సమర్పించి, నిర్ణీత సమయంలో మ్యాపింగ్ ఎందుకు జరగలేదో వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.రాబోయే ఎన్నికలపై ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని, ఇంటింటా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపునిచ్చారు. సదస్సులో కూటమి నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు, కూటమి శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0