విద్యార్థులే రహదారి భద్రతకు కీలక పాత్ర  డిసిపి షరీనా బేగం

Jan 31, 2026 - 22:37
Jan 31, 2026 - 22:54
 0  11
విద్యార్థులే రహదారి భద్రతకు కీలక పాత్ర  డిసిపి షరీనా బేగం

విద్యార్థులే రహదారి భద్రతకు కీలక పాత్ర  డిసిపి  షరీనా బేగం

విజయవాడ జనవరి 31 (వెలుగునాడు ప్రతినిధి) :  విద్యార్థులు తమ ఇళ్లలో తల్లిదండ్రులకు, బంధువులకు రోడ్డు ప్రమాదాలను వివరించి, రహదారి భద్రతకు కీలకంగా వ్యవహరించాలని డిసిపి శ్రీమతి షరీనా బేగం, ఐపిఎస్ కోరారు.జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు సభను నగరంలోని బెంచ్ సర్కిల్ సమీపంలో గల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిపి శ్రీమతి షరీనా బేగం, హాజరయ్యారు.ఈ సందర్భంగా డిసిపి శ్రీమతి షరీనా బేగం మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు రోడ్డు భద్రత నియమాలను వివరించి, వారిని చైతన్యవంతం చేయాలని సూచించారు. భవిష్యత్ తరాలకు సురక్షిత రహదారులను అందించడంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని ఆమె అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మీ కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ దరించేవిధంగా మీరు చెయ్యాలని విద్యార్థులకు చెప్పారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయాలలో అది ప్రాణాలను కాపాడుతుందని సూచించారు. కారులో ప్రయాణించేటప్పుడు డ్రైవర్‌తో పాటు వెనుక సీట్లో కూర్చున్న వారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ఎక్కువుగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, నియంత్రిత వేగంతో వాహనం నడపాలని అన్నారు. వాహనం నడుపుతున్నప్పుడు ఫోన్‌లో మాట్లాడటం, మెసేజ్‌లు చేయడం వంటివి చేయకూడదని, ఇది ఏకాగ్రతను దెబ్బతీస్తుందని వివరించారు. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, ఇది ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులను అనుసరించి వాహనం నడపాలని, పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసిపి శ్రీమతి షరీనా బేగం, ఐపిఎస్ తెలిపారు. సంయుక్త రవాణా కమిషనర్ ఎ. మోహన్ మాట్లాడుతూ 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లాలో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు, డ్రైవర్లకు, పాదచారులకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు జిల్లాలో చేపట్టడం జరిగిందని తెలిపారు.కళాశాలల్లో విద్యార్థులతో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, యువతలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే, ఈ సంవత్సరం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఎ. మోహన్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా జిల్లా కలెక్టరు జి లక్ష్మిశ ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన నిర్ణయాలను తీసుకొని, జిల్లా అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా ఈ ప్రమాదాలు సంఖ్య తగ్గాయన్నారు. ప్రమాదాలు లేని జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను చూపించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రోడ్డు భద్రత అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రహదారి భద్రత కార్యక్రమంలో పాల్గొన్న రవాణాశాఖ అధికారులకు, పోలీసు అధికారులకు, స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులకు, వాహన డీలర్లకు కళాశాల యాజమాన్యాలకు సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ రోడ్డు భద్రత కార్యక్రమాలకు సహకరించిన నగరంలోని వివిధ కాలేజీ, స్కూళ్ల విద్యార్థులకు, యాజమాన్యంకు, వాహనాల డీలర్లకు, రోడ్ సేఫ్టీ స్వచ్ఛంద సంస్థలకు, ప్రెస్ మరియు మీడియా వాళ్ళకు పోలీసు డిపార్ట్మెంట్ అందరికీ ఎ. మోహన్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిడీఎన్ హెచ్ ఐ విద్యాసాగర్, స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు, ఆర్టీవోలు ఆర్ ప్రవీణ్, కె వెంకటేశ్వరరావు, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు ఎం రాజుబాబు, జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి రమేష్, రోడ్ సేఫ్టీ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సుంకర రాము, వీడు వాసు, పద్మజ, విమల, మోటార్ వెహికల్ తనిఖీ అధికారులు, ఉద్యోగులు, వివిధ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్, విద్యార్థులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్