విజిలెన్స్ కమిటీలు వినియోగదారుల పరిరక్షణ కౌన్సిల్ కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలి
విజిలెన్స్ కమిటీలు వినియోగదారుల పరిరక్షణ కౌన్సిల్ కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలి
క్యాప్కో చైర్మన్ జి. సురేష్ కుమార్
విజయవాడ జూన్ 28,( వెలుగు నాడు ప్రతినిధి) : రాష్ట్రంలో వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీలు మరియు వినియోగదారుల పరిరక్షణ కౌన్సిల్ (Consumer Protection Council) కమిటీలను ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (క్యాప్కో) చైర్మన్ జి. సురేష్ కుమార్ డిమాండ్ చేశారు.ఆదివారం విజయవాడలోని ఎస్‌ఎన్‌ఆర్ హోటల్లో నిర్వహించిన క్యాప్కో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జి. సురేష్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఐదేళ్లపాటు రాష్ట్ర విజిలెన్స్ కమిటీలు, వినియోగదారుల పరిరక్షణ కౌన్సిల్ కమిటీలను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధోరణిని కొనసాగించడం విచారకరమని అన్నారు. వినియోగదారులు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే ఈ కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వ్యవస్థను కల్పించాలని కోరారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల సంఘాలను బలోపేతం చేసి, గ్రామ స్థాయి వరకు వినియోగదారుల ఉద్యమాన్ని విస్తరించేందుకు క్యాప్కో కృషి చేస్తుందని తెలిపారు.క్యాప్కో రాష్ట్ర వైస్ చైర్మన్ కర్లపాటి వెంకట శ్రీనివాస రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్థాల వ్యాపారం విస్తృతంగా జరుగుతోందని, దానిని నియంత్రించాల్సిన ఆరోగ్య శాఖలో భారీ స్థాయిలో ఖాళీలు ఉండటంతో సమర్థవంతమైన తనిఖీలు జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాప్కో హానరబుల్ చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో వినియోగదారుల ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రస్తుతం పనిచేస్తున్న కేంద్రాలకు తగిన ఆర్థిక, పరిపాలనా సహకారం అందించాలని కోరారు.క్యాప్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మిడి శివమూర్తి మాట్లాడుతూ, త్వరలో గ్రామస్థాయి నుంచి వినియోగదారుల సంఘాల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ కోదండ రాము వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019పై సభ్యులకు అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. భాస్కరరావు (విశాఖపట్నం), ఉషాదేవి (మహిళా వైస్ చైర్మన్, చిత్తూరు), ఐ.ఎస్.ఎన్. రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ (ఆళ్లగడ్డ), శివ సత్యనారాయణ (అనకాపల్లి), చిన్న తంబి చిన్నప్పతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0