ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండించిన టీడీపీ నాయకుడు మాదిగాని గురునాధం

Jan 22, 2026 - 23:15
 0  3
ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండించిన టీడీపీ నాయకుడు మాదిగాని గురునాధం

ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండించిన టీడీపీ నాయకుడు మాదిగాని గురునాధం

 విజయవాడ, జనవరి 22, (వెలుగు నాడు ప్రతినిధి ) : ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన రాయితీ బకాయిలు, ప్రోత్సాహకాల విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ నాయకుడు మాదిగాని గురునాధం తీవ్రంగా ఖండించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.2022–23 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సుమారు రూ.800 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై మోపుతూ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిప‌డ్డారు. సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భ‌త్వం 2024–25 సంవత్సరానికి సంబంధించి రూ.209.69 కోట్ల రాయితీలను మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో 6,675 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు, 1,159 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందారని చెప్పారు.అదేవిధంగా 2025–26 సంవత్సరానికి రూ.269.90 కోట్ల రాయితీలను మంజూరు చేయడంతో మొత్తం 11,125 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూరిందని వివరించారు. తాజాగా రూ.60.21 కోట్లను విడుదల చేయగా, ఇందులో 3,123 మంది ఎస్సీ, 423 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందుతున్నారని స్పష్టం చేశారు.

సబ్సిడీలు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ మంగళగిరిలో ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్లు నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో, కొంతమంది వైసీపీ నాయకులు బ్లూ మీడియా ద్వారా కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వడం లేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాదిగాని గురునాధం విమర్శించారు.ఇదిలా ఉండగా, దావోస్‌లో ప్రపంచ దేశాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొని దాదాపు రూ.6 లక్షల 65 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలు కుదుర్చుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపాదించిన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వైసీపీ ఈ తరహా అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్