కోట మార్కండేయ జడ్పీ హైస్కూల్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహా సమ్మేళనం
కోట మార్కండేయ జడ్పీ హైస్కూల్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహా సమ్మేళనం
తిరువూరు, జనవరి 19, (వెలుగు నాడు ప్రతినిధి) : గంపలగూడెం మండలం,పెనుగొలను గ్రామం.కోట మార్కండేయ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం పూర్వ విద్యార్థుల ఆత్మీయతతో కళకళలాడింది.ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక్క చోట కలుసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహా సమ్మేళనం భావోద్వేగాలతో, సేవా సంకల్పాలతో ఘనంగా నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలు, గురువుల మార్గదర్శనం, పాఠశాల ఇచ్చిన విలువలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ జీవితాలకు బలమైన పునాది వేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకుని నేడు వివిధ రంగాల్లో స్థిరపడిన తమ జీవిత ప్రయాణాన్ని వివరించుతూ, విద్యే తమను ఈ స్థాయికి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. గురువుల త్యాగం, క్రమశిక్షణ, విలువల బోధనే తమ విజయాలకు కారణమని భావోద్వేగంగా వెల్లడించారు.పూర్వ విద్యార్థులు ఐక్యంగా ఏర్పడి ఒక కమిటీని స్థాపించడం ఈ సమ్మేళనానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది* *పాఠశాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో కమిటీ ముందుకు రావడం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. ఇది కేవలం సమావేశం కాకుండా, సేవా దృక్పథానికి నాంది పలికిన సందర్భమని పలువురు అభిప్రాయపడ్డారు.ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఒక పూర్వ విద్యార్థి విషయంలో కమిటీ చూపిన మానవత్వం అందరి హృదయాలను తాకింది. ఒక్క రోజులోనే లక్షా ఎనభై వేల రూపాయల నిధులు సమీకరించి, అతడికి బ్రెయిన్ సర్జరీ చేయించడం ద్వారా పూర్వ విద్యార్థుల ఐక్యత ఎంత శక్తివంతమో చాటారు.ఈ సహాయంతో ఆ విద్యార్థి ప్రాణాపాయం నుంచి బయటపడగా, ఆయన కుటుంబ సభ్యులు పూర్వ విద్యార్థుల కమిటీకి కన్నీటి కృతజ్ఞతలు తెలిపారు.
సమ్మేళనంలో ప్రస్తుత విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చాయి.విద్యార్థుల ప్రతిభ, ఉత్సాహం ప్రేక్షకులను ఆకట్టుకోగా, పూర్వ విద్యార్థుల్లో కొత్త స్ఫూర్తిని నింపాయి.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాఠశాలపై తమ అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ ఆత్మీయ మహా సమ్మేళనం సేవ, స్నేహం, సామాజిక బాధ్యతలకు ప్రతీకగా నిలిచి, రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0