దేశ జలవనరుల అభివృద్ధికి కె.ఎల్. రావు చిరస్మరణీయ సేవలు
దేశ జలవనరుల అభివృద్ధికి కె.ఎల్. రావు చిరస్మరణీయ సేవలు
దేవినేని ఉమామహేశ్వర రావు
విజయవాడ మే,18 (వెలుగు నాడు ప్రతినిధి) : భారతదేశ జలవనరుల, అభివృద్ధికి అపూర్వ సేవలు అందించిన ప్రముఖ ఇంజనీర్, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కానూరి లక్ష్మణరావు వర్థంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు నివాళులు అర్పించారు. సోమవారం గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, “జలవనరుల శిల్పి”గా పేరుగాంచిన కె.ఎల్.రావు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించిన కె.ఎల్.రావు ఇంజనీరింగ్ రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచి, అనంతరం దేశ జలవనరుల రంగంలో విశిష్ట సేవలందించారన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, తుంగభద్ర, హీరాకుడ్, చంబల్, కోసి, ఫరక్కా బ్యారేజ్ వంటి అనేక కీలక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద మట్టిఆనకట్టలలో ఒకటైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలిచిందన్నారు. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన కె.ఎల్.రావు, మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ మంత్రివర్గాలలో కేంద్ర నీటిపారుదల, విద్యుచ్ఛక్తి శాఖ మంత్రిగా సేవలందించారన్నారు.దేశంలో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారంగా గంగా–కావేరి నదుల అనుసంధాన ప్రతిపాదనను ముందుకు తెచ్చిన దూరదృష్టి గల మహనీయుడిగా ఆయన గుర్తింపు పొందారు. నదుల అనుసంధానం ద్వారా కరువు, వరద సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అప్పట్లోనే సూచించారని గుర్తు చేసారు. ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిందన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు “కె.ఎల్.రావు ప్రాజెక్టు”గా నామకరణం చేయడం ఆయన సేవలకు నిలువెత్తు గుర్తింపుగా నిలిచింది. దేశ జలవనరుల అభివృద్ధికి ఆయన చూపిన దారి, నిర్మించిన ప్రాజెక్టులు, ప్రతిపాదించిన దూరదృష్టి ఆలోచనలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. కె.ఎల్. రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్ ఆర్దర్ కాటన్, శ్రీరామకృష్ణయ్యల సేవలకు గుర్తుగా వారి జయంతులను సీఎం చంద్రబాబు గారు రాష్ట్ర పండుగలుగా నిర్వహించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0