చికెన్ సిండికేట్ దోపిడీ అరికట్టండి
చికెన్ సిండికేట్ దోపిడీ అరికట్టండి
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి చిన్నా
జగ్గయ్యపేట, మార్చి22, (వెలుగు నాడు ప్రతినిధి) : చికెన్ ధరలు సామాన్యునికి అందనంతగా పెరిగిపోయాయని,ఇది కూడా సిండికేట్ దోపిడీగా మారిందని వైసీపీ రాష్ట్రకార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్న)అన్నారు.ఆదివారం జగ్గయ్యపేట లోని ఆయన నివాసంలో చిన్నా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పెరిగిన చికెన్ ధరలపై కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.రాష్ట్రంలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చికెన్ అందని ద్రాక్షగా మారిందన్నారు.ఎన్‌ఇసిసి నిర్దేశించిన ధరల కంటే ఎక్కువగా ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ ధరల పెంపులో ప్రభుత్వ పెద్దల వాటా ఎంత ఉందో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
మద్యం, ఇసుక, మట్టి, బియ్యం సిండికేట్ల దోపిడీ కంటే చికెన్ సిండికేట్ దోపిడీ మరింత పెరిగిపోయిందని మండిపడ్డారు.చికెన్ ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.కనీసం అధికారులు కూడా చికెన్ దుకాణాలపై తనిఖీలు చేయకపోవడం వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయా అని ప్రశ్నించారు.ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, చికెన్ ధరల పెంపు మరింత ఆర్థిక భారంగా మారిందన్నారు.చికెన్ సిండికేట్‌కు ప్రభుత్వం మౌన మద్దతు ఇస్తోందని ఆరోపణ చేశారు.అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ సిండికేట్‌లో భాగస్వాములు అన్న అనుమానాలు వ్యక్తం చేశారు.రైతులకు న్యాయం జరగడం లేదు, వినియోగదారులు కూడా దోపిడీకి గురవుతున్నారు.మధ్యలో మాఫియా లాభపడుతోందన్నారు.వెంటనే ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.చికెన్ ధరల విషయంలో పారదర్శకత లేకపోవడం వెనుక పెద్ద స్కాం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.వెంటనే ధరలను తగ్గించకపోతే ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0