సామాజిక భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట
సామాజిక భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట
నందిగామ జూన్ 01, (వెలుగు నాడు ప్రతినిధి) : పట్టణంలోని 11వ మరియు 6వ వార్డులలో సోమవారం నిర్వహించిన సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నేరుగా పెన్షన్ నగదును అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ దారులతో ఆత్మీయంగా మాట్లాడిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య , “మీకు అందుతున్న ఈ పెన్షన్ నగదు ఏ విధంగా ఉపయోగపడుతోంది?” అని ప్రశ్నించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులు నెల మొదటి తేదీన ఇంటి వద్దకే పెన్షన్ అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, పేదలు, వృద్ధులు, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు చేరవేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సామాజిక భద్రత పెన్షన్లు లబ్ధిదారులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని, ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వార్డు నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0