తిరువూరు సచివాలయం–3 లో నిలిచిపోయిన సేవలు

Mar 12, 2026 - 03:14
 0  10
తిరువూరు సచివాలయం–3 లో నిలిచిపోయిన సేవలు

తిరువూరు సచివాలయం–3 లో నిలిచిపోయిన సేవలు

రెండు సంవత్సరాలుగా కంప్యూటర్ లేక ప్రజలకు అవస్థలు

ఎన్టీఆర్ బ్యూరో మార్చి 11 (వెలుగునాడు ప్రతినిధి ) : జిల్లా పరిధిలోని,తిరువూరు పట్టణ పరిధిలోని మూడో నెంబర్ సచివాలయం ఐదు, ఆరు వార్డుల ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే ముఖ్య కేంద్రంగా ఉండాల్సి ఉండగా, ప్రాథమిక సదుపాయాల లేమితో సేవలు దాదాపు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా సచివాలయంలో కంప్యూటర్ లేకపోవడం వల్ల అనేక సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు అవసరమైన కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, ఆన్లైన్ నమోదు సేవలు, పన్నుల ధ్రువీకరణలు వంటి కీలక సేవలు కంప్యూటర్ ఆధారంగా ఉండటంతో ప్రస్తుతం వాటిని అందించలేని పరిస్థితి ఏర్పడింది. కంప్యూటర్ లేకపోవడంతో సిబ్బంది డేటా ఎంట్రీలు, ఆన్లైన్ ధ్రువీకరణలు నిర్వహించలేకపోతున్నారు. అత్యవసరమైన పనుల కోసం సిబ్బంది మరో సచివాలయం లేదా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఖాళీగా ఉన్న కంప్యూటర్ వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్, ప్రజా సర్వే వంటి కొన్ని సేవలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్ ద్వారా నిర్వహిస్తున్నప్పటికీ, మిగతా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఐదు, ఆరు వార్డులకు చెందిన వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు చిన్న చిన్న పనుల కోసం పలుమార్లు సచివాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిబ్బందికి కనీస వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. కార్యాలయంలో ఫర్నిచర్ ఉన్నప్పటికీ పరికరాలు లేక వినియోగంలోకి రావడం లేదు. గోడలకు వేలాడుతున్న విద్యుత్ తీగలు మాత్రమే కనిపిస్తుండగా, అవసరమైన పరికరాలు మాత్రం అందుబాటులో లేవని స్థానికులు చెబుతున్నారు.సచివాలయం సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు మీసేవ కేంద్రాలను ఆశ్రయించి అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ సదుపాయాల లేమితో నిర్వీర్యంగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. కావున తక్షణమే కంప్యూటర్లు, ప్రింటర్లు మరియు అవసరమైన మౌలిక వసతులు కల్పించి సచివాలయాన్ని పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్